శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబర్ 22, 1887—ఏప్రిల్ 26, 1920) భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుభందం ఏర్పడింది. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు.
రామానుజన్ డిసెంబర్ 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రం లోని ఈరోడ్ పట్టణములో ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు. రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకి చెందిన వారు.తల్లి కోమలటమ్మాళ్ గృహిణి, ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంభకోణం అనే పట్టణంలో, సారంగపాణి వీధిలో, దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు. ఇది ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. రామానుజన్ ఒకటిన్నర సంవత్సరాల వయసులో ఉండగా ఆయన తల్లి సదగోపన్ అనే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ మూడు నెలలు పూర్తవక మునుపే ఆ బిడ్డ కన్నుమూశాడు. డిసెంబర్ 1889 లో రామానుజన్ కు మశూచి (అమ్మవారు) వ్యాధి సోకింది. కానీ తంజావూరు జిల్లాలోని ఈ వ్యాధి సోకి మరణించిన చాలామంది లాగా కాకుండా బ్రతికి బయట పడగలిగాడు. తరువాత రామానుజన్ తల్లితోపాటు చెన్నైకి దగ్గరలో ఉన్న కాంచీపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళింటికి చేరాడు. 1891లో మళ్ళీ 1894 లో రామానుజన్ తల్లి ఇరువురి శిశువులకు జన్మనిచ్చినా ఏడాది తిరగక మునుపే వారు మరణించడం జరిగింది.
1892 అక్టోబరు 1లో రామానుజన్ అదే ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు.మార్చి 1894లో ఇతడిని ఒక తెలుగు మాధ్యమ పాఠశాలకు మార్చడం జరిగింది. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానం లోని ఉద్యోగం కోల్పోవడంతో, రామానుజన్ తల్లితో సహా కుంబకోణం చేరుకుని అక్కడ కంగయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. నాన్న తరుపు తాత చనిపోవడంతో రామానుజన్ను మళ్ళీ మద్రాసులో నివాసం ఉంటున్న తల్లి తరుపు తాత దగ్గరికి పంపించారు. కానీ అతనికి మద్రాసులో పాఠశాల నచ్చలేదు. తరచూ బడికి ఎగనామం పెట్టేవాడు. అతని తాత, అమ్మమ్మలు రామనుజన్ బడిలో ఉండేటట్లుగా చూసేందుకు వీలుగా ఒక మనిషిని కూడా నియమించారు. కానీ ఆరు నెలలు కూడా తిరగక మునుపే కుంభకోణం పంపించేశారు.
రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవడం మూలంగా చిన్నపుడు అతని బాధ్యతలు తల్లే చూసుకొనేది. కాబట్టి తల్లితో చాలా గాఢమైన అనురాగం కలిగి ఉండేవాడు. ఆమె నుంచి రామానుజన్ సంప్రదాయాల గురించి, కుల వ్యవస్థ గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాడు. ??రాల వయసు లోపలే ఆంగ్లము, తమిళము, భూగోళ శాస్త్రం, గణితంలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. మంచి మార్కులతో జిల్లాలో అందరికన్నా ప్రథముడిగా నిలిచాడు. 1898 లో అతని తల్లి ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. అతడికి లక్ష్మీ నరసింహం అని నామకరణం చేశారు. అదే సంవత్సరంలో రామానుజన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు. ఈ పాఠశాలలోనే మొట్ట మొదటి సారిగా గణితశాస్త్రంతో (formal mathematics) పరిచయం ఏర్పడింది.